పెను తుఫాన్‌గా మారుతోన్న నివర్ సైక్లోన్

వాస్తవం ప్రతినిధి: తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తున్న‌ ‘నివర్‌’ తుఫాన్ తీరం దాటింది. చెన్నై మహానగరాన్ని అల్లకల్లోలం చేసిన తుపాను.. బుధవారం రాత్రి 10-30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్యకాలంలో పుదుచ్చేరిలో తీరాన్ని దాటినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుపానుకాస్తా.. తీవ్ర తుపానుగా బలహీనపడింది.

తుఫాన్ తీరం దాటిన సమయంలో వీచిన గాలులకు భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలకు భారీ నష్టం వాటిల్లింది. తీరం దాటిన క్రమంలో అతితీవ్ర తుపాన్ నుంచి తీవ్ర తుఫాన్ గా రూపాంతరం చెందిందని అధికారులు తెలిపారు.

తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో మరో 24 గంటలపాటు గంటకు 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తమిళనాడులోని తిరువణ్ణామలై, కడలూర్, కల్లకురిచ్చి, విలుప్పుం ప్రాంతాల్లో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

తుఫాన్ హెచ్చరికలతో ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా 34 రైళ్లు రద్దు చేసిన రైల్వేశాఖ మరో 13 రైళ్లను దారి మళ్లించింది.