తిరుపతి ఉప ఎన్నికపై అదే సస్పెన్స్‌..అభ్యర్ది ఎంపికపై కమిటీ ఉంటుందన్న జనసేనాని

వాస్తవం ప్రతినిధి: తిరుపతి ఉప ఎన్నికలో నిలబడేది బీజేపీ అభ్యర్థా.? జనసేన అభ్యర్థా.? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా రాలేదు. కొద్ది రోజుల్లోనే అన్ని వివరాలూ తెలుస్తాయి.. అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

నడ్డా పిలుపు మేరకే ఢిల్లీ వచ్చానన్న ఆయన.. తమ భేటీలో ప్రధానంగా తిరుపతి ఉప ఎన్నికల విషయమే చర్చకు వచ్చిందన్నారు. ఉపఎన్నిక బరిలో ఏ అభ్యర్థిని బరిలోకి దించాలో నిర్ణయించేందకు ఓ కమిటీ వేయాలన్న నిర్ణయానికి వచ్చామన్నారు పవన్.

అమరావతి రాజధాని, పోలవరం అంశాలతోపాటు భవిష్యత్తులో జనసేన, బీజేపీ పొత్తును ఏ రకంగా బలోపేతం చేయాలనే విషయాలపై చర్చించామని పవన్ వివరించారు. అమరావతి రాజధాని విషయంలో చివరి రైతుకూ న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు.