ఎట్టకేలకు అధికార బదిలీకి డొనాల్డ్‌ ట్రంప్‌ ఆమోదముద్ర.. జ‌న‌వ‌రి 20వ తేదీన అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు తాను పట్టిన పట్టు వీడారు. అధ్యక్ష ఎన్నికల్లో తనపై నెగ్గిన డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని బదలాయించడానికి అంగీకరించారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అధికార మార్పిడి ప్రక్రియ మొదలు పెట్టాలని ఆయన వైట్‌ హౌస్‌ అధికారులకు ఆదేశాలిచ్చారు. మూడు వారాల తీవ్ర ప్రతిష్ఠంభన అనంతరం… అమెరికా కొత్త అధినేత ఎవరన్నది లాంఛనంగా ప్రకటితమైంది. నాలుగేళ్ల పాటు అధికారంలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు.. అధికార బదిలీకి తన ఆమోదముద్ర వేశారు. దీంతో- దేశ 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ పార్టీకి చెందిన జో బైడెన్‌ను గుర్తిస్తున్నట్లు, అధికార బదిలీ ప్రక్రియ ఆరంభిస్తున్నట్లు కీలకమైన సాధారణ సేవల పాలనా విభాగం (జీఎ్‌సఏ) మంగళవారంనాడు లాంఛనంగా ప్రకటించింది.

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 20వ తేదీన అమెరికా అధ్య‌క్షుడిగా బైడెన్ ప్ర‌మాణ స్వీకారం చేస్తారు. అధికార బ‌ద‌లాయింపు ప్ర‌క్రియ చేప‌ట్టే జీఎస్ఏ బైడెన్ బృందంతో ట‌చ్‌లో ఉన్న‌ట్లు అధ్య‌క్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. అడ్మినిస్ట్రేట‌ర్ ఎమిలీ మ‌ర్ఫీ ఆ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు. బైడెన్ అధికార బ‌ద‌లాయింపు కోసం 6.3 మిలియ‌న్ల డాల‌ర్ల ఫండ్‌ను కేటాయించిన‌ట్లు తెలుస్తోంది. దేశ ప్ర‌యోజ‌నాల కోసం.. ప్రాథ‌మికంగా అధికార బ‌ద‌లాయింపు కోసం కావాల్సిన పనుల‌న్నీ చేప‌ట్టాల‌ని ఎమిలీని ఆదేశించిన‌ట్లు ట్రంప్ తెలిపారు. త‌మ బృందానికి కూడా ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు.