వాస్తవం ప్రతినిధి: రష్యాకు చెందిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ 95 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు ఆ దేశం పేర్కొన్నది. రెండవ మధ్యంతర ఫలితాలకు సంబంధించిన నివేదికను స్పుత్నిక్ రిలీజ్ చేసింది. అయితే టీకా తొలి డోసు తీసుకున్న 28 రోజుల్లో వ్యాక్సిన్ సమర్థత 91.4 శాతంగా ఉందని, తొలి డోసు తీసుకున్న 42 రోజుల తర్వాత దాని సమర్థత 95 శాతంగా ఉన్నట్లు స్పుత్నిక్ కంపెనీ వెల్లడించింది.
రెండు డోసుల్లో ఇచ్చే ఈ టీకాను అంతర్జాతీయ మార్కెట్లో 10 డాలర్ల లోపే ఇస్తామని, రష్యా పౌరులకు మాత్రం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. వ్యాక్సిన్ను 2–8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచాల్సి ఉంటుందన్నారు. తొలిడోసు ఇచ్చిన 42 రోజుల అనంతరం సేకరించిన డేటా ఆధారంగా టీకా ప్రభావాన్ని లెక్కించామని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ, గమలేయా రిసెర్చ్ సెంటర్, ఆర్డీఐఎఫ్ ప్రకటించాయి.
అమెరికా కంపెనీలు ఫైజర్, మోడెర్నాల ఎం-ఆర్ఎన్ఏ రకం కొవిడ్ వ్యాక్సిన్ల ధరలతో పోలిస్తే ఇది రెండు, మూడు రెట్లు తక్కువన్నారు. అయితే రష్యా పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందుతుందని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాక్సిన్ ప్రభావశీలత సగటున 95 శాతం ఉందని ఆయన తెలిపారు.