గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ సరికొత్త హామీ…!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడానికి ఆపసోపాలు పడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓటమి పాలవడంతో చాలామంది టీ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇతర పార్టీలోకి వెళ్లడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలంగాణ రాజకీయవర్గాలలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పార్టీ పరువు కాపాడుకోవాలని టీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వరద కారణంగా ఇళ్లు దెబ్బ తిన్న బాదితులకు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎన్నికల మానిఫెస్టోని ఆ పార్టీ ఇన్చార్జ్ మణిక్యం ఠాకూర్, పిసిసి అద్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి తదితరులు విడుదల చేశారు. వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. ఎంఎంటీఎస్‌, మెట్రోల్లో దివ్యాంగులు, మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. మెట్రో సేవలు పాతబస్తీ నుంచి ఎయిర్‌పోర్టు వరకూ పొడిగిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. అర్హులందరికీ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని వెల్లడించింది. 80 గజాలలోపు ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకున్నవారికి ఆస్తి పన్ను రద్దు అని ప్రకటించింది. ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ లేకుండా చేస్తామనికాంగ్రెస్ తెలిపింది.