ప్రధాని మోడీకి నాలుగు ప్రశ్నలు సంధించిన రాహుల్

వాస్తవం ప్రతినిధి: కరోనావైరస్ ప్రపంచమంతా విజృంభిస్తున్నా.. ఆ వైరస్ కలిగించే కోవిడ్-19 వ్యాధి నుంచి శరీరానికి రక్షణనిచ్చే వ్యాక్సిన్ ఏదీ ఇంకా విస్తృత వినియోగం కోసం ఆమోదం పొందలేదు.

వేగంగా వ్యాక్సిన్‌ తయారు చేయటం కోసం వైద్యరంగ నిపుణులు శాయశక్తులా శ్రమిస్తున్నారు. గ్రామాల్లోనూ వ్యాధి విజృంభిస్తోంది.

కరోనా వ్యాక్సిన్ కి సంబంధించి వచ్చే ఏడాది వ్యాక్సిన్ విడుదల చేస్తామని కొన్ని సంస్థలు, మరో నెలలో వ్యాక్సిన్ రెడీ అని కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఏ వ్యాక్సిన్ ను ఎంపిక చేసుకోవాలి?. ఈ విషయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచన ఎలా ఉంది? ఇదే విషయంపై నరేంద్ర మోడీని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఏకంగా నాలుగు ప్రశ్నలు సంధించి.. జవాబివ్వాలని కోరారు. దేశ ప్రజలకు ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈమేరకు ఆయన తన ప్రశ్నలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలు..

1. ఎన్నో కరోనా వ్యాక్సిన్లు వస్తున్నాయి కదా.. వాటిలో భారత ప్రభుత్వం ఏ వ్యాక్సిన్‌ను ఎంచుకుంటుంది? ఆ వ్యాక్సినే ఎంచుకోవడానికి కారణాలేంటి?

2. వ్యాక్సిన్ వస్తే మొదట ఎవరికి అందిస్తారు? పంపిణీకి విధివిధానాలు ఏంటి?

3. దేశ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ ఇచ్చేందుకు పీఎం కేర్స్ నిధులు అందిస్తుందా?

4. ఇంతకీ.. దేశ ప్రజలందరికీ ఎప్పటిలోగా వ్యాక్సిన్ ఇస్తారు?

రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా సమాధానం ఇస్తారో, ఎలా స్పందిస్తారో చూడాలి.