ప్రజల విశ్వాసం పొందిన నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడు : పుతిన్‌

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా వారితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. అయితే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన జో బైడెన్‌ ఇప్పట్లో గుర్తించలేమని చెప్పారు.

అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని గుర్తించడానికి తాను సిద్ధంగా లేనని రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌ స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసం పొందిన నాయకుడే ఎన్నికల్లో గెలుస్తాడని చెప్పారు. ఆ విజయాన్ని ప్రతిపక్షం కూడా గుర్తించాలన్నారు. ఫలితాన్ని చట్టబద్ధంగా ప్రకటిస్తే గుర్తిస్తామని పేర్కొన్నారు. డొనాల్డ్‌ ట్రంప్, పుతిన్‌ సన్నిహిత మిత్రులన్న ప్రచారం ఉంది. జో బైడెన్‌ అధ్యక్షుడైతే రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని పుతిన్‌ అనుమానిస్తున్నట్లు సమాచారం. కాగా, 2016 ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌ విజయానికి రష్యా సహాయపడిందని అమెరికా నిఘా సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్‌ విషయంలో అధ్యక్షుడు పుతిన్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.