తెలంగాణ కాంగ్రెస్ నేతలపై గులాం నబీ ఆజాద్ సెటైర్లు..!!

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుందని, అందుకు కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులే అన్నట్టు ఆ పార్టీకి చెందిన కీలక నాయకుడు గులాంనబీ ఆజాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సరైన రీతిలో రాణించలేక పోవడంతో విమర్శలు భారీస్థాయిలో సొంత పార్టీ నుండి వచ్చాయి. పార్టీలో ఎవరికి వారు అన్నట్టు వ్యవహరించటం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి దారుణం అయిందని సొంత పార్టీ శ్రేణులు అంటున్నాయి.

ఇదిలా ఉండగా తెలంగాణ లో పార్టీ ఆ స్థితికి రావటానికి కారణం మేము కాదు అంటూ ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పెద్దల వ్యాఖ్యలు ఉన్నాయి. ఇటీవల గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ… కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థ సంస్థాగతంగా కుప్పకూలిందని. ‘‘పంచాయతీ, మండల స్థాయి నుంచి పార్టీని తిరిగి నిర్మించాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థలో ఎవరైనా నేత ఎన్నికైతే అది సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుత వ్యవస్థ వల్ల లాభం లేదని ఆజాద్ అన్నారు. ప్రజలకు కాంగ్రెస్‌ నేత లకు మధ్య సంబంధం తెగిపోయిందన్నారు. నాయకులు ఫైవ్‌స్టార్‌ హోటళ్లను వీడి క్షేత్రస్థాయిలో పని చేయాలని అజాద్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలపై సెటైరికల్ గా వ్యాఖ్యానించారు.