కానిస్టేబుల్ అంతిమయాత్రలో పాడె మోసిన సజ్జనార్

వాస్తవం ప్రతినిధి: సైబరాబాద్ పోలీసుహెడ్ క్వార్టర్స్​లో గత రెండేళ్లుగా ఏఆర్ కానిస్టేబుల్​గా పని చేస్తున్న ఆంజనేయులు రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మరణించారు. నాలుగు రోజుల క్రితం విధులకు హాజరయ్యేందుకు మోటార్ సైకిల్‌పై వస్తుండగా సోమన్ గుర్తి గేటు వద్ద ఆంజనేయులును బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. సీపీ సజ్జనార్ సూచన మేరకు ఆంజనేయులు అవయవాలను కుటుంబ సభ్యులు ఇతరులకు దానం చేశారు. ఇక, ఆంజనేయులు కానిస్టేబుల్ గా అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన అంతిమయాత్రలో సీపీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. పాడె మోసి తమ పోలీసు సహచరుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి.