గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదు: ప్రకాశ్ జవదేకర్

వాస్తవం ప్రతినిధి: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రకాశ్ జవదేకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరేళ్లలో 60 వైఫల్యాలంటూ బీజేపీ చార్జిషిషీటు విడుదల చేసింది హైదరాబాద్ లో ఈ కార్యక్రమంలో పాల్గొన్న జవదేకర్.. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి జరగట్లేదని చెప్పారు. కనీసం డ్రైనేజీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిందని తెలిపారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు .

టీఆర్ఎస్ నేతలు హైదరాబాద్ ను విశ్వనగరంగా చెప్పారని, కానీ, దీన్ని ప్లడ్ సిటీనగరంగా మార్చారని ఆయన అన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని టీఆర్ఎస్ చెప్పిన మాటలు మూటలయ్యాయని ఆయన విమర్శలు గుప్పించారు. లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లు కడతామని చెప్పారని అయితే, వెయ్యి కూడా కట్టలేదని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కారు రెండున్నర కోట్ల ఇళ్లను కట్టి చూపించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ కుటుంబం, సన్నిహితుల ఆస్తులు పెరుగుతున్నాయి గానీ హైదరాబాద్‌లో పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షాలకు 15 రోజులు హైదరాబాదీలు ఇళ్లలోనే ఉండిపోయారని తెలిపారు.

కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిందని తెలిపారు. హైదరాబాద్ మేయర్‌గా ఎంఐఎం అభ్యర్థి కావాలా? లేక బీజేపీ అభ్యర్థి కావాలా? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో బీజేపీ కృషి ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం బీజేపీ పోరాడింది ఇటువంటి పాలన కోసం కాదని ఆయన చెప్పారు.