నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం

వాస్తవం ప్రతినిధి: నేడు శ్రీవారి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు. 7 టన్నుల పుష్పాలతో ఈ యాగం నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీ‌వారి ఆల‌యంలో శ‌నివారం పుష్పయాగం సంద‌ర్భంగా రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ‌ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ కారణంగా ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత‌ బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
కాగా.. నిన్న శ్రీవారిని 27, 123 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.41 కోట్లు వచ్చింది. కాగా… 9, 844 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.