అమెరికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో “తానా” ఫుడ్ డ్రైవ్..!

వాస్తవం ప్రతినిధి: తానా లేదా ఉత్తర అమెరికా తెలుగు సంఘం అనేది ఉత్తర అమెరికాలో నివసిస్తున్న తెలుగు ప్రజల సంఘం. తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి మరియు పరివ్యాప్తం చేయడానికి, తెలుగు ప్రజల మరియు వారి సంతతి యొక్క గుర్తింపుని కాపాడడానికి, మరియు తెలుగు సాహిత్య, సాంస్కృతిక, విద్యా, సాంఘిక, సేవా చర్చలకు ఓ వేదికగా నిలవడానికి ఈ సంఘం ఏర్పాటైంది. ఇప్పటికే పలు సేవాకార్యక్రమాలు చేసిన తానా తాజాగా.. అమెరికా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వందకు పైగా ఫుడ్ బ్యాంకులకు ఆహారపదార్థాలు అందజేస్తోంది.

అమెరికాలో ఈ కోవిడ్‌ వల్ల ఎంతోమంది నిరుపేదలు తిండికోసం కష్టాలు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికే తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని తానా కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌ మల్లివేమన చెప్పారు. ఈ సందర్భంగా 1,00,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాలను పంపిణీ చేయనున్నామని, 150 ప్రాంతాల్లో ఈ సహాయం చేయనున్నట్లు చెప్పారు. అన్ని దానాలలో అన్నదానం గొప్పదని పెద్దలు చెబుతుంటారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలకు, ప్రెసిడెంట్‌ జయ్‌ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్‌ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ అంజయ్య చౌదరి లావు, తానా నేషనల్‌ కేర్స్‌ చైర్‌ జోగేశ్వరరావు పెద్దిబోయినకు మల్లివేమన ధన్యవాదాలు తెలిపారు