దమ్ముంటే అరెస్ట్ చేయండి: బండి సంజయ్

వాస్తవం ప్రతినిధి: దమ్ముంటే అరెస్ట్ చేయాలంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రెచ్చగొట్టినట్లు సీ ఎం మాట్లాడితే తప్పు లేదుగానీ తాను మాట్లాడితే తప్పా అని ప్రశ్నించారు.

వరద సాయంపై ఈసీకి తాను లేఖ రాయలేదని బండి సంజయ్ మరోసారి వెల్లడించారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, టీఆర్ఎస్ కుట్రపన్నుతోందంటూ మండిపడ్డారు. బీజేపీని చూసి సీఎం కేసీఆర్ భయపడుతున్నారన్న బండి సంజయ్, టీఆర్ఎస్ నేతలు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే చెప్తున్నారంటూ మండిపడ్డారు. అటు వరదసాయం నిలిపివేతపై తానూ ఈసీకి తాను లేఖ రాసినట్లు చేసిన ఆరోపణలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు పిలిస్తే ఎందుకు రాలేదని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. భాగ్యలక్ష్మి ఆలయానికి కాకపోయిన పక్కనే ఉన్న మక్కామసీదులో ప్రమాణం చేసినా బాగుండేదని బండి సంజయ్ అన్నారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక తాము జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలిస్తే వరదల వలన నష్టపోయిన బాధితులకి రూ. 20 వేలు అందజేస్తామని అన్నారు సంజయ్.