సోమవారం విచారణకు రానున్న దీపక్ కొచ్చర్ బెయిలు పిటిషన్‌

వాస్తవం ప్రతినిధి  ఐసీఐసీఐ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్‌పై కఠినంగా వ్యవహరించబోమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీం ధర్మాసనానికి తెలిపింది. ఈ మేరకు జస్టిస్ ఎస్‌కే కౌల్ నేతృత్వంలోని బెంచ్‌కు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
మరోవైపు, వీడియోకాన్ గ్రూపునకు రూ. 1,875 కోట్ల రుణం మంజూరు కేసులో తన భర్త దీపక్ కొచ్చర్‌ను అరెస్ట్ చేయడం, సీఈవోగా తనను తొలగించడాన్ని సవాలు చేస్తూ చందా కొచ్చర్ దాఖలు చేసిన రెండు పిటిషన్ల విచారణను కోర్టు వాయిదా వేసింది. అలాగే, దీపక్ కొచ్చర్ బెయిలు పిటిషన్‌ సోమవారం విచారణకు రానున్నట్టు ఆమె తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.
కాగా, ఈడీ ఇటీవలే చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌తోపాటు వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ దూత్‌లపై మనీలాండరింగ్ అభియోగాల కింద చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కొచ్చర్, దూత్ సహా ఇతరులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన ఈడీ.. ఈ ఏడాది సెప్టెంబరులో దీపక్ కొచ్చర్‌ను అరెస్ట్ చేసింది.