రూల్స్ ప్రజలకేనా..? మీకు లేవా మంత్రిగారూ..?

వాస్తవం ప్రతినిధి: శుక్రవారం నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు భక్తులందరూ పుష్కర స్నానాన్ని షవర్ కింద చేయాలన్న నిబంధనను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది.

అయితే తెలంగాణ రాష్ట్ర దేవదాయా శాఖామంత్రి ఇంద్రకరణ్ రెడ్డి..ఇతర మంత్రులు శ్రీనివాస్ గౌడ్.. నిరంజన్ రెడ్డిలతో పాటు ఎమ్మెల్యే అబ్రహం తదితరులు పుష్కర స్నానాన్ని ఆచరించారు.  మామూలు రోజుల్లో అందరూ కలిసి నదిలోకి వెళ్లి స్నానం చేయటం పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ కరోనా వేళలో కాసింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.  కీలక పదవుల్లో ఉండేవారు.. అందరికి ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా మంత్రులు మాత్రం ఎంచక్కా నదిలోకి దిగి స్నానం చేశారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులు సైతం స్నానాలు ఆచరించటం చూస్తే.. మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ.. ఇలా చేయటం ఏమిటి? అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజానీకం.

మరింత చిత్రమైన విషయం ఏమంటే.. కరోనా వేళ భక్తులు నిబంధనలకు అనుగుణంగా పుష్కర స్నానాలు చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిబంధనలు విధించారు కూడా. ఓవైపు తాము తీసుకొచ్చిన నిబంధనలకు విరుద్ధంగా స్నానం చేసిన మంత్రి ఇంద్రకరణ్ అండ్ కో.. ప్రజల్ని మాత్రం రూల్స్ కు తగ్గట్లు స్నానం చేయాలని కోరటం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు.