చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలే: రోజా

వాస్తవం ప్రతినిధి: సీఎం జగన్ చిన్నవాడైనా ఎంతో పద్ధతిగా, పారదర్శకంగా రాజకీయాలు నడపడం చూస్తున్నామని, కానీ చంద్రబాబు జీవితం మొత్తం వెన్నుపోటు, శవరాజకీయాలేనని విమర్శించారు నగరి ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా.
ఈ రోజు రోజా తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన సోదరుడి పెళ్లిరోజు, తన మేనకోడలి పుట్టినరోజు కావడంతో నేడు స్వామివారి దీవెనలు అందుకునేందుకు వచ్చామని రోజా మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్ర రాజకీయాలపైనా స్పందించారు.

తిరుపతి ఎంపీ కరోనాతో చనిపోతే వెంటనే అభ్యర్థిని నిలబెట్టి ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని రాజకీయాలకు తెరలేపిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రం ఓవైపు కరోనాతో అతలాకుతలం అవుతుంటే, 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రజలకు అండగా నిలవాలనో, భరోసా ఇవ్వాలనో ప్రయత్నించకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడంటూ విమర్శించారు. తనను ముఖ్యమంత్రిని చేసిన ప్రజలకు పార్టీ తరఫునో, తన తరఫునో మద్దతుగా నిలవాల్సిన చంద్రబాబు రాజకీయాలే ముఖ్యమన్నట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.