వాస్తవం ప్రతినిధి: కరోనాపై యుద్ధంలో ముందువరుసలో నిలబడి పోరాడుతోన్న ఆరోగ్య సిబ్బందితో బైడెన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ .. భావోద్వేగానికి గురయ్యారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ ప్రాణాలను పణంగాపెట్టి ఫ్రంట్‌లైన్ వర్కర్లు సేవలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫైర్‌ఫైటర్స్, హోంకేర్ వర్కర్లు, ఐసీయూలో పని చేసే నర్సులు, టీచర్లతో జో బైడెన్ వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఫ్రంట్‌లైన్ వర్కర్లు తమ క్షేత్రస్థాయి అనుభవాలను జో బైడెన్‌తో పంచుకున్నారు. కాగా.. మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్ అనే నర్సు కొవిడ్ బాధితుల వేదనను బైడెన్‌కు తెలియజేశారు.
మేరీ టర్నర్ తన అనుభవాలను వివరిస్తూ.. సరైన రక్షణ సదుపాయాలు లేకపోవడం వలన తమ ఆసుపత్రిలో పనిచేసే నర్సులు ఎన్–95 మాస్కులను తిరిగి తిరిగి ఉపయోగించాల్సి వస్తోందని ఆమె వెల్లడించారు. మాస్క్‌ల కొరత, నర్సులు విరామం లేకుండా పనిచేయాల్సి రావడం, కనీస రక్షణ పరికరాలు లేకపోవడం, టెస్టింగ్ కిట్ల కొరతలతో సహా. దేశవ్యాప్తంగా మార్చి నెలనుంచి వృత్తిపరంగా తామెదుర్కొంటోన్న అనేక సమస్యలను ఆమె జోబైడెన్ ముందుంచారు. సౌకర్యాల లేమి కారణంగా ఆరోగ్య కార్యకర్తలకు గత యేడాది కాలంగా కోవిడ్ పరీక్షలు నిర్వహించలేదని ఆమె వెల్లడించారు. భావోద్వేగంతో మాట్లాడుతోన్న టర్నర్ అనుభవాలను విన్నతరువాత, అందుకు సమాధానంగా బైడెన్ మాట్లాడుతున్నప్పుడు జో బైడెన్ కన్నీటిని తుడుచుకోవడం కనిపించింది.
ఇదిలా ఉంటే.. అమెరికాలో కొవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు లక్షకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2.50లక్షలు దాటగా.. కోటి 15లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో పరిస్థితి తీవ్రమవుతోందని, చేయి దాటిపోయేలా ఉందని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ జొనాథన్ రైనర్ అన్నారు. ‘రెండు, మూడు వారాల కిందట దేశంలో 70 వేలు, 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం లక్షా 50 వేలకు పైగా రికార్డయ్యాయి. బుధవారం ఒక్క రోజే దాదాపు 2 వేల మంది కరోనాతో మరణించారు. మున్ముందు 3 వేల మరణాలు కూడా నమోదవ్వొచ్చు’ అని చెప్పారు.