వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యాన్ని రెండుసార్లు పాలించిన నేత. ఎన్నో సంఘటనలు.. మరెన్నో వాస్తవాలు.. అన్నింటినీ ఓ పుస్తకం చేసి పొందుపరిచిన విషయం తెలిసిందే. ఇప్పుడా బుక్ వండర్ క్రియేట్ చేసింది. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రచించిన ‘‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’’పుస్తకం రికార్డులు సృష్టిస్తోంది. రిలీజైన తొలి 24 గంటల్లో ఈ బుక్ 8.9 లక్షల కాపీలు అమ్ముడైంది. ఆధునిక అమెరికా చరిత్రలో బెస్ట్ సెల్లింగ్ ప్రెసిడెన్షియల్ రచనగా నిలవనుంది.
ఈ పుస్తకాన్ని ముద్రించిన పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ లెక్కల ప్రకారం.. అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో ఇంత మొత్తంలో అమ్ముడయిన దాఖలాలు లేవు. 2017లో ఒబామా దంపతులు ఈ పుస్తకం కోసం 65 మిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నారు. అంటే మన కరెన్సీలో దాదాపు 481 కోట్లు అన్నమాట. అమెరికాలో ఇదే అతిపెద్ద ఒప్పందం అని చెబుతున్నారు. గతంలో ఒబామా రచించిన ‘‘డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్’’, ‘‘ద ఆడిసిటీ ఆఫ్ హోప్’’ పుస్తకాలు సైతం విశేష ఆదరణ పొందాయి. పలువురు రివ్యూ రచయితలు తాజా పుస్తకాన్ని ప్రశంసించారు.