ఎంఐఎం ప్రతిపాదనను టీఎంసీ అంగీకరిస్తుందా..?

వాస్తవం ప్రతినిధి: బీహార్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం.. అదే ఊపును బెంగాల్‌నూ ప్రదర్శించాలని ఉవ్విళ్లూరుతోంది. తమ పార్టీని క్రమంగా విస్తరిస్తూ ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేస్తున్న ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై దృష్టి సారించారు. వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు మమత బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు అసదుద్దీన్ ప్రకటించారు.

పశ్చిమ బెంగాల్‌లో మైనారిటీలు ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర, దక్షిణ దినాజ్‌పూర్‌లతోపాటు దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని ఎంఐఎం యోచిస్తున్నట్లు తెలిపారు. అయితే, ఎంఐఎం ప్రతిపాదనను టీఎంసీ అంగీకరించడం అనుమానంగానే ఉన్నట్లు తెలుస్తోంది.