పంచాయతీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ వర్సెస్ జగన్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ చేస్తున్న హడావిడికి వైసీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుందని ఇప్పటికే రాష్ట్ర సిఎస్ నీలం సాహ్ని ఎన్నికల కమిషనర్ కి లెటర్ రాయడం జరిగింది.

ఇదిలా ఉండగా తాజాగా కరోనా కేసులపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ చేసిన వ్యాఖ్యలకు పూర్తి విరుద్దంగా ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయాలు ఉన్నాయి. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వస్తోందని, ఇప్పటికే పలు దేశాల్లో వ్యాపించిందని ఆయన అన్నారు. ఢిల్లీ మరోసారి లాక్‌డౌన్‌కు సిద్ధమవుతోందన్నారు. అందువల్ల రాష్ట్రంలో మనం జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో యూరప్‌ మొత్తం వణుకుతోంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపిస్తోంది. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్‌. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది. ప్రస్తుతానికి కోవిడ్‌ పాజిటవ్‌ కేసులు తగ్గినా, సెకండ్‌ వేవ్‌ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని ఆయన అన్నారు. కాగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎపిలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని , అందువల్ల ఎన్నికలు జరుపుతానని అంటున్న సంగతి తెలిసిందే.