విద్యాశాఖ మంత్రి అయ్యుండి కనీసం జాతీయ గీతం కూడా రాదా సారూ..?

వాస్తవం ప్రతినిధి: ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే . ఆయన మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా ఎన్నికైన మేవలాల్‌ చౌదరీ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష ఆర్జేడీ నేతలు కూడా ఆయనను ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే..

బీహార్‌ విద్యాశాఖ మంత్రి మేవలాల్‌ చౌదరీ తాజాగా ఓ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఎగురవేసి, జాతీయ గీతం పాడారు. అయితే, ఆయన జాతీయ గీతాన్ని తప్పుగా పాడారు. జనగణమణ పాడుతూ మధ్యలో కొన్ని పదాలను మర్చిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది ఆ వీడియోను చూశారు. భారతీయుడు, విద్యా శాఖ మంత్రి అయ్యుండి ఆయనకు కనీసం జాతీయ గీతం కూడా రాదా సారూ.. అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.