అండర్-17 బాలికల ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను రద్దు: ప్రకటించిన ఫీఫా

వాస్తవం ప్రతినిధి: ఈ సంవత్సరం ఇండియాలో జరగాల్సిన అండర్-17 బాలికల ఫుట్ బాల్ వరల్డ్ కప్ ను రద్దు చేస్తున్నట్టు ఫీఫా ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా తొలుత 2021లో పోటీలను జరిపిస్తామని చెప్పిన ఫీఫా, అది కూడా సాధ్యం కాకపోవచ్చన్న ఆలోచనలో పోటీలను పూర్తిగా రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఇదే సమయంలో 2022 పోటీలను జరిపే అవకాశం ఇండియాకు ఇస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా సమావేశమైన ఫీఫా కౌన్సిల్, ప్రపంచంలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న పరిస్థితులను సమీక్షించి, ఈ నిర్ణయం తీసుకుంది.

అండర్-17తో పాటు కోస్టారికాలో జరగాల్సిన అండర్-20 బాలికల వరల్డ్ కప్ ను కూడా రద్దు చేస్తున్నామని, 2022లో కోస్టారికాలోనే ఈ పోటీలు జరుగుతాయని ఫీఫా ఓ ప్రకటనలో తెలిపింది. “ఈ టోర్నమెంట్ లను మరింతగా వాయిదా వేయడానికి వీల్లేదు. అందువల్ల 2020 ఎడిషన్ ను రద్దు చేస్తున్నాం. సభ్య దేశాలన్నీ ఇదే కోరుకున్నాయి. 2020లో పోటీలకు ఆతిథ్యమిచ్చే దేశాలకే, తదుపరి ఎడిషన్ పోటీలను జరిపేందుకు అవకాశం ఇస్తున్నాం” అని వెల్లడించింది.