తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ..భక్తులతో కిటకిటలాడుతున్న ప్రముఖ శైవ క్షేత్రాలు!

వాస్తవం ప్రతినిధి: ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈరోజు నుంచి ప్రారంభం అయింది. తెలుగు మాసముల ప్రకారం ఎనిమిదో నెల కార్తీకం. కృత్తికా నక్షత్రంలో చంద్రుడు కలుస్తాడు కాబట్టి దీనిని కార్హ్తీకం అంటారని చెబుతారు. దీపావళి అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చే పాడ్యమి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది.తెలుగు మాసాలు..తిథుల లెక్కల ప్రకారం కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజూ ప్రత్యేకమైనదే. ఆధ్యాత్మికంగా విశిష్టతలు సంతరించుకున్నదే. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనదిగా చెప్పుకునే కార్తీకం విష్ణుమూర్తికీ ఇష్టమైన మసమే అని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో కార్తీకమాసం శోభ ప్రారంభమైంది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు, నదీ తీరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలు దేవాలయాల్లో కరోనా నిబంధనలను అనుసరించి, భక్తులకు దర్శనాలను కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. విశ్వేశ్వరుడు కొలువైన వారణాసి, మల్లికార్జునుడు కొలువుదీరిన శ్రీశైలం, శ్రీకాళహస్తీశ్వరుడు కొలువైన కాళహస్తి, రాజరాజేశ్వరుడు కొలువైన వేములవాడతో పాటు త్రిలింగ క్షేత్రాలు, పంచారామాలు సహా అన్ని శివాలయాల్లో ఈ తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి మొదలైంది.

ప్రధాన దేవాలయాల్లో భక్తుల రద్దీ సాధారణ స్థాయితో పోలిస్తే తక్కువగానే ఉంది. అన్ని దేవాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు.

విజయవాడలో కృష్ణా ఘాట్, భవానీ ఘాట్, రాజమండ్రిలోని స్నానాల ఘాట్, శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని అలంపురం వద్ద కూడా అధికారులు భక్తుల స్నానాలకు ఏర్పాట్లు చేశారు.