రాహుల్‌ గాంధీ పరిణతిలేని విద్యార్థి: బరాక్‌ ఒబామా

వాస్తవం ప్రతినిధి: అమెరికాను పాలించిన తొలి నల్లజాతి అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తన పాలనాకాలంలో కలిసిన వివిధ దేశాల నాయకులపై వెల్లడించిన స్వీయ అభిప్రాయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. అగ్రరాజ్య అధ్యక్షుడిగా భారత్‌లో పర్యటించిన ఆయన భారత ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేతలు సోనియా, రాహుల్‌ గాంధీల గురించి తన ఆత్మకథ ‘ఏ ప్రామిస్డ్‌ ల్యాండ్‌’లో ప్రస్తావించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ధైర్యం లేనివాడని, పూర్తిగా పరిణతి చెందలేదని వ్యాఖ్యానించారు.

‘వ్యక్తిత్వం ఎదగని విద్యార్థి తన పనులతో ఉపాధ్యాయుడిని మెప్పించి మేధావినని నిరూపించుకొనేందుకు ప్రయత్నించినట్టు’గా రాహుల్‌ ప్రవర్తన ఉన్నదని నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీని మాత్రం ఒబామా ఆకాశానికెత్తేశారు. కఠిక పేదరికం నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యానికి నాయకుడిగా ఎదిగిన మోదీ భారత్‌లో ప్రధాన సంస్కర్త అని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఏ భావమూ కనిపించని నిజాయితీపరుడని, సోనియాగాంధీ అందమైన, తెలివైన మహిళ అని అన్నారు.