భారత్ పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ధీటుగా సమాధానమిస్తాం: మోడీ

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోదీ శనివారం జైసల్మీర్ లో సాయుధ దళాలతో కలిసి యుధ్ధ ట్యాంక్ పై కొద్దీ దూరం ప్రయాణించారు.సరిహద్దుల్లో ఏ దేశమైనా ఇండియా పట్ల దురుసుగా ప్రవర్తించిన పక్షంలో దీటుగా సమాధానమిస్తామని ఆయన హెచ్చరించారు. సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని ఆయన చైనా, పాకిస్థాన్ దేశాలకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.

ఈ దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సరిహద్దుల్లో భద్రతా విధులు నిర్వర్తిస్తున్న జవాన్ల వద్దకు వెళ్లిన సంగతి తెలిసిందే. మోదీ ఇవాళ రాజస్థాన్ లోని లోంగేవాలా సైనిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడి వీర సైనికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన వారికి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడారు.

కరోనా కారణంగా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని తిరిగి తీసుకురావడంలో భారత వైమాని దళం, నావికా దళం చేసిన కృషి ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేవలం శత్రువులతో పోరాడే సామర్థ్యాన్నే కలిగి ఉండటం కాకుండా, విపత్తుల సమయంలో ప్రజలకు సహాయం చేయడంలోనూ సాయుధ దళాలు ముందున్నాయని ఆయన ప్రశంసించారు. ”కరోనా సమయంలో భద్రతా బలగాలు యుద్ధ ప్రాతిపదికన సేవలందించాయి. మాస్కులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, మెడికల్ తదితర వస్తువులను అందించడంలో చాలా సమర్థవంతంగా సేవలందించాయి.” అని మోదీ ప్రశంసించారు. భారత్ పెద్ద పెద్ద దేశాలతో సైనిక విన్యాసాలు కూడా చేస్తోంది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మకంగా వ్యవహరించే దేశాలతోనూ కలిసి పనిచేస్తున్నాం. ప్రపంచంలో ఉగ్రవాద స్థావరాలు ఏ మూలన ఉన్నా… లేపేసే సత్తా భారత ఆర్మీకి ఉంది.” అని మోదీ ప్రశంసించారు. భారత భూభాగంపై ఎవరు కన్నేసినా… వారికి దీటైన సమాధానం చెప్పే సత్తా కూడా భారత ఆర్మీకి ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.