యువకుడి ని అడవిలోకి లాక్కెళ్లి చంపేసిన పెద్ద పులి

వాస్తవం ప్రతినిధి: కుమురంభీం జిల్లా దహెగాం మండలం దిగిడలో దారుణం జరిగింది. ఓ పొలంలో పనిచేస్తున్న యువకుడిపై అక్కడే మాటువేసి ఉన్న ఓ పులి దాడిచేసి చంపేసింది. గ్రామానికి చెందిన సిడాం విఘ్నేశ్ (22) తన స్నేహితులు శ్రీకాంత్, నవీన్‌లతో కలిసి పత్తిచేను వద్దకు వెళ్లారు.

ఈ క్రమంలో పొదలచాటున మాటువేసిన పులి విఘ్నేశ్‌పై దాడిచేసి నోట కరచుకుని అడవిలోకి లాక్కెళ్లింది. అనంతరం అతడిని చంపేసింది. పులి దాడితో భయంతో వణికిపోయిన శ్రీకాంత్, నవీన్‌లు పరుగుపరుగున గ్రామంలోకి వెళ్లి విఘ్నేశ్ కుటుంబ సభ్యులు, గ్రామస్థులకు విషయం చెప్పారు. దీంతో అందరూ కలిసి వచ్చి ఆ ప్రాంతంలో గాలించగా ఓ చోట విఘ్నేశ్ మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.