వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు. కేవలం విజయానికి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్. విజయంపై పూర్తి స్పష్టత లేకపోయినప్పటికి బైడెన్ ఓ రికార్డు నెలకొల్పారు. అమెరికా చరిత్రలోనే అత్యధిక ఓట్లు సంపాదించిన అధ్యక్ష అభ్యర్థిగా అగ్ర స్థానంలో నిలిచారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడైన డోనాల్డ్ ట్రంప్ పై పోటీపడుతోన్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బైడెన్ అమెరికా చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లను సంపాదించుకున్నారు. ఇప్పటివరకూ లెక్కించిన ఓట్లలో బైడెన్ 7.16 కోట్లకు పైగా ఓట్లను పొందగలిగారు. ఇప్పటివరకూ అత్యధిక ఓట్ల రికార్డు అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరిట ఉండేది. 2008లో జరిగిన ఎన్నికల్లో ఒబామాకు అత్యధికంగా 6.94 కోట్ల ఓట్లు వచ్చాయి. ఈ రికార్డును ఇప్పుడు బైడెన్ అధిగమించారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో జో బైడెన్‌కు 7.07కోట్లకుపైగా ఓట్లు సాధించారు. ఇది ఇప్పటి వరకు అధ్యక్ష పదవికి పోటీ చేసిన వారి కంటే ఎక్కువ అని నేషనల్ పబ్లిక్ రేడియో (ఎన్పీఆర్) నివేదించింది. 2008లో ఒబామాకు లభించిన ఓట్లకంటే 3లక్షలు ఎక్కువని చెప్పింది.