వాస్తవం ప్రతినిధి : ప్రపంచమంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడింది. అత్యంత శక్తిమంతమైన ఈ పదవికి పోటీ ఎప్పుడూ గట్టిగానే ఉంటుంది. ఈసారి దానికి కరోనా తోడై ‘వైరసవత్తరం’గా మార్చింది. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయావకాశాలను కొవిడ్-19 తీవ్రంగా ప్రభావితం చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా సర్వేల ప్రకారం.. ట్రంప్ తన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ కంటే పూర్తిగా వెనుకబడి ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, మిషిగన్లో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగించారు. “ట్రంప్.. దేశాధ్యక్షత అనే బాధ్యతను రియాలిటీ షోగా ఆయన భావిస్తారు. మహమ్మారితో కుంటుపడిన మన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాలంటే బైడెన్ అధ్యక్షుడు కావాలి” అని ఒబామా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అహాన్ని తృప్తి పరచుకోవడంపైనే దృష్టి పెట్టారు తప్ప.. ప్రజలకు ఏమాత్రం మేలు చేయలేదని బరాక్ ఒబామా విమర్శించారు.