పుల్వామా దాడి చేసింది మేమే…గర్వంగా చెప్పుకొన్న పాక్!

వాస్తవం ప్రతినిధి: జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని ఆ దేశ శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల మంత్రి ఫవాద్ చౌధురి చెప్పడం కలకలం రేపింది.

2019 ఫిబ్రవరిలో 14న జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఘోర ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. ఆ దాడిలో 40 మంది సీఆర్పిఎఫ్ జవాన్లు వీర మరణం పొందారు. తొలుత ఈ దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేశారని అంతా అనుమానించారు. తాజాగా ఈ దాడికి ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాక్ ప్రభుత్వానికి ప్రత్యేక్ష సంబంధం ఉందని ఆ దేశ మంత్రి పాకిస్థాన్ మంత్రి ఫవద్ చౌదరి జాతీయ అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. పుల్వామా దాడి పాకిస్తాన్ చేసిందని గర్వంగా వెల్లడించాడు. ఇది తమ విజయంగా చెప్పుకొచ్చాడు.

అలా ప్రకటించిన కొద్దిసేపటికే పాకిస్థాన్ దిద్దుబాటు చర్యలకు దిగింది. పుల్వామా దాడి తర్వాత భారత్ తో జరిగిన వైమానిక దాడి గురించే తాను మాట్లాడానని ఫవాద్ చెప్పారు. అమాయకులను చంపి తాము ధైర్యవంతులుగా చెప్పుకోదల్చుకోలేదని అన్నారు. ఉగ్రవాదానికి తాము ముందు నుంచి వ్యతిరేకమే అని చెప్పారు. తన మాటలను భారత మీడియా వక్రీకరించిందని అన్నారు. పుల్వామా దాడి చేయించింది పాకిస్థానే అని తాను అనలేదని చెప్పారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు.