వివాదంలో ఏపీ టీడీపీ ఆఫీస్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపై అదే విధంగా వారికి సంబంధించిన ఆస్తులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే బాలకృష్ణ పెద్దల్లుడు భరత్ కి సంబంధించిన భవనాల విషయంలో తీవ్రస్థాయిలో కబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఆయన కుటుంబ సభ్యులు ఎక్కడికక్కడ భూములు కబ్జా చేసినట్లు తాజా పరిస్థితులపై అధికారపార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవల పర్యావరణ నిబందనలకు విరుద్దంగా చెరువు స్థలాన్ని ఆక్రమించి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం నిర్మించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రామకృష్ణ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ముందుగా ఈ వివాదానికి సంబంధించి హైకోర్టులో వెళ్లిన అక్కడ న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణకు స్వీకరించడం జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ నారిమన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ ఆర్కే తరపున న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, రమేష్ వాదనలు వినిపించారు. టీడీపీ, ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.