పెళ్లి చేస్తా..ఇల్లు నేనే కట్టిస్తా అంటున్న సీఎం కేసీఆర్..!!

వాస్తవం ప్రతినిధి: మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు. కేసిఆర్ సారథ్యం లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లి నేనే చేస్తా అని దేశంలో అంటున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లకు శ్రీకారం చుట్టిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేసే కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్వం పెద్దలు ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అనే సామెత చెబుతూ ఉంటారు, ఆ రెండు పనులు చేయటం అంటే మనిషికి చాలా కష్టం. కానీ వాటిని భుజాన వేసుకుని తెలంగాణ ప్రజలపై భారం లేకుండా సీఎం కేసిఆర్ పరిపాలన చేస్తున్నారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇల్లు కట్టినట్లు చూపించి డబ్బులు దండుకున్నారని ఆరోపణలు చేశారు. అదేవిధంగా పేదింటి కుటుంబాలకు ఆడబిడ్డ భారం కాకూడదని ఉద్దేశంతో “కళ్యాణ లక్ష్మీ” పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కేటీఆర్ వివరించారు.