సింగపూర్‌లో ధూంధాంగా బతుకమ్మ సంబరాలు..!!

వాస్తవం ప్రతినిధి : సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్, టాస్-మనం తెలుగు వారి సహకారంతో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా, ధూంధాంగా నిర్వహించారు. కరోనా కోరల్లోంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తెలుగు వారందరి క్షేమమే ప్రత్యేక ఉద్దేశంగా ఈ సంవత్సరం బతుకమ్మ సంబరాల్ని సాంఘిక మాధ్యమాల ద్వారా జరిపారు.

కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఐదుగురు-ఐదుగురు సమూహంగా జూం యాప్ ద్వారా అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో, కోలాటాల విన్యాసాలతో సద్దుల బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొన్నారు. క్లిష్టసమయంలో సైతం పండుగ శోభ ఏమాత్రం తగ్గకుండా రకరకాల పువ్వులతో అనేక రంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ కనువిందుచేశాయి.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ.. సింగపూర్‌లో నివసిస్తున్న తెలుగువారందికీ ఈ సందర్భంగా తెలుగు సమాజం తరపున బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆన్‌లైన్ ద్వారా ప్రసారం చేయబడిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ వేడుకలో పాల్గొని విజయవంతం చేయడంలో సహకరించిన అందరికీ, కార్యవర్గసభ్యులకు, సింగపూర్ తెలంగాణ ఫ్రెండ్స్‌కు, టాస్-మనం తెలుగు వారికి, స్పానసర్లకు కార్యదర్శి సత్యచిర్ల కృతజ్ఞతలు తెలియజేశారు.