డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన కేటీఆర్

వాస్తవం ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు .

ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు మ‌హ‌ముద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్‌, హైద‌రాబాద్ క‌లెక్ట‌ర్ శ్వేతా మ‌హంతి పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇళ్లు లేేని పేదలకు అన్ని హంగులతో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని 2014 ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చామన్నారు. ఇల్లు క‌ట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అని పెద్ద‌లు సామెత చెబుతుంటారనీ, అంటే ఆ రెండు ప‌నులు చేయ‌డ‌మంటే క‌ష్టంతో కూడుకున్న ప‌ని అని అర్ధం, అయితే నీ ఇల్లు నేనే క‌ట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా అని అని సీఎం కేసీఆర్ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారన్నారు. డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పేద‌ల ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక అని అన్నారు.

క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కాల ద్వారా నిరుపేద ఆడ‌పిల్ల‌ల వివాహాల‌కు ల‌క్షా నూట ప‌ద‌హారు రూపాయాలు అందిస్తున్నామ‌ని తెలిపారు. పేద‌వారికి ఒక మేన‌మామ‌లా కేసీఆర్ ఉన్నారు. భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ చూడ‌ని విధంగా.. బ‌ల‌హీన వ‌ర్గాల ఆత్మ‌గౌర‌వం కోసం డ‌బుల్ బెడ్ రూం ఇండ్ల‌ను క‌ట్టించి ఇస్తున్నామ‌ని తెలిపారు.

పండుగ వాతావ‌ర‌ణంలో గృహా ప్ర‌వేశాలు జరుపుకుంటున్నాం. న‌గ‌రం మొత్తంలో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూంలు సిద్ధంగా ఉన్నాయి. ఇవాళ జియ‌గ‌డూ, గోడె కి క‌బ‌ర్, క‌ట్టెల‌మండిలో క‌లిసి 1152 ఇండ్లు పేద‌వారికి అందజేస్తున్నామ‌ని చెప్పారు.