పోలవరం కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటున్న సీఎం జగన్..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి ప్రాజెక్టు పోలవరం విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని తాజాగా మరోసారి గుర్తు చేశారు. గత కొద్ది రోజుల నుండి పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధుల విషయంలో కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో…పోలవరం ప్రాజెక్టు సమీక్ష సమావేశం నిర్వహించిన జగన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు అని, కాబట్టి అది పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వంపై ఉందని కుండ బద్దలు కొట్టారు. అంతేకాకుండా ప్రస్తుతం చేస్తున్న ఖర్చుతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అది చాలా కష్టమైన పని అని చెప్పారు. భూసేకరణ పునరావాసం కోసం సుమారు 29 వేల కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో తేలింది. కాగా తాజాగా సి.డబ్ల్యూ.సి ఆమోదించిన ప్రాజెక్టు మొత్తం వ్యవధిలో ప్రస్తుతం అయితే దాదాపు 56 వేల కోట్లకు పైగానే ఖర్చు అయ్యే అవకాశం ఉందని కాబట్టి ఈ విషయంలో కేంద్రం సహకరించాలని ఏపీ సీఎం జగన్ అభ్యర్థించారు.