భారతీయ అమెరికన్లంటే ఆయనకు అస్సలు పడదు : జో బైడెన్

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ప్రత్యర్థుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా భారతీయుల పట్ల ట్రంప్ ప్రేమ ఫోటోలకే పరిమితమన్నారు. శనివారం భారతీయ అమెరికన్లతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

బైడెన్ మాట్లాడుతూ.. ‘ట్రంప్‌ ఓ జాత్యాహంకారి.. మాయమాటలతో అధికారంలోకి వచ్చి.. తన విధానాలతో భారతీయ అమెరికన్లను ఇబ్బందులకు గురిచేశాడు. భారతీయ అమెరికన్లంటే ఆయనకు అస్సలు పడదు.. వచ్చే ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించండి.. నేను అధికారంలోకి వస్తే అన్ని రంగాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తా. భారత్- అమెరికా మధ్య సంబంధాల విషయంలో ట్రంప్ కేవలం ఫొటోలకే పరిమితమయ్యారు. నేను మాత్రం అలా కాదు.. ఆయా అంశాల్లో ఇరు దేశాలు సంతృప్తికరమైన ఫలితాన్ని పొందేలా చేస్తా. ఉగ్రవాద నిర్మూలన విషయంలో భారత్‌తో కలిసి పనిచేస్తాం. చైనాయే కాదు.. మరే ఇతర దేశం కూడా సరిహద్దు దేశాల్లో అలజడులు సృష్టించకుండా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటా.. అమెరికాలోని కాలేజీలు, యూనివర్శిటీల్లో ట్యూషన్ ఫీజును లక్షా 25వేల డాలర్లలోపే ఉండేలా చేస్తా.. దీని వల్ల వేలాది భారతీయ అమెరికన్ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ’ అంటూ జో బైడెన్ అన్నారు.