ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా?..

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురవడంతో చాలా పంటపొలాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనంతపురం జిల్లా లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆ తర్వాత ట్విటర్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేస్తూ సంచలన కామెంట్ పెట్టారు. ట్విటర్ లో అనంతపురం జిల్లా పర్యటించి లోకేష్ పెట్టిన కామెంట్ చూస్తే ఇలా ఉంది…క్షేత్రస్థాయిలో అడుగుపెట్టి రైతులతో మాట్లాడితే వాళ్ళను ఏ రకంగా ఆదుకోవాలో తెలుస్తుందని, రాజభవనాల్లో కలెక్షన్లు లెక్కపెట్టుకుంటూ కూర్చుంటే ప్రజల కన్నీటిని తుడిచేదెవరని ప్రశ్నించారు. అంతేకాదు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని కూడా నిలదీశారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ రైతుల కష్టాలు వర్ణనాతీతమని వేరుశనగ రైతులకు రూ. 2 వేల కోట్ల పంట నష్టం జరిగితే ఇప్పటి వరకు రూ. 25 లక్షల పరిహారం మాత్రమే ఇవ్వడం ఏంటి అని, ఇలా చేస్తే రైతు ఏమై పోవాలని అన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు రూ. 25 వేలు పరిహారంగా ఇవ్వాలని అలా అయితేనే కానీ రైతు కోలుకునే పరిస్థితి ఉండదని అన్నారు.