చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబయి ఇండియన్స్ ఘనవిజయం

వాస్తవం ప్రతినిధి: షార్జాలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్స్ ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. మొదట ముంబయి బౌలర్లు చెన్నై జట్టును 114 పరుగులకే కట్టడి చేయగా, ఆ తర్వాత పనిని ఓపెనర్లు ఇషాన్ కిషన్, క్వింటన్ డికాక్ పూర్తిచేశారు. వీరిద్దరి విజృంభణతో ముంబయి ఇండియన్స్ కేవలం 12.2 ఓవర్లలోనే 116 పరుగులు చేసి జయభేరి మోగించింది.

ఇషాన్ కిషన్ చిచ్చరపిడుగల్లే చెలరేగి 37 బంతుల్లో 68 పరుగులు సాధించగా, డికాక్ 37 బంతుల్లో 46 పరుగులు నమోదు చేశాడు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ 6 ఫోర్లు, 5 సిక్సులతో విధ్వంసం సృష్టించాడు. డికాక్ 5 ఫోర్లు, 2 సిక్సులు బాదాడు. చెన్నై బౌలర్లు ఎంత శ్రమించినా కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.