నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది ప్రశంసించారు: డోనాల్డ్‌ ట్రంప్‌

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరింది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య నాష్‌విల్లేలో తుది సంవాదం నాస్‌విల్లేలో జరిగింది. ట్రంప్‌, బైడెన్‌ మధ్య కొవిడ్‌ సన్నద్ధత, అమెరికా కుటుంబాలు, పర్యావరణ మార్పులు, జాతీయ భద్రతా, నాయకత్వం సహా ఆరు ప్రశ్నలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ కరోనా నివారణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య ప్రపంచమంతా ఉందన్నారు. ఇదో ప్రపంచ సమస్య అని, అయితే మహమ్మారిని ఎదుర్కొవడంలో నా ప్రభుత్వం తీసుకున్న చర్యలను చాలామంది దేశాధినేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. కొన్ని వారాల్లోనే వాక్సిన్‌ను అందుబాటులోకి వస్తుందని ట్రంప్‌ చెప్పారు. ఆర్మీ సాయంతో వ్యాక్సిన్‌ను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు.

ట్రంప్‌ ప్రభుత్వం వైఫల్యంతోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో నిలిచిందని డెమొక్రాట్‌ అభ్యర్థి జోబైడెన్‌ విమర్శించారు. రోజుకు వెయ్యి మందికిపైగా చనిపోతున్న పరిస్థితుల్లో మనం ఉన్నామని, ప్రతి రోజు 70వేల కేసులు నమోదవుతున్నాయన్నారు. మహమ్మారి విషయంలో చాలా ఆలస్యంగా ప్రభుత్వం మేలుకుందన్నారు. కరోనా మహమ్మారిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించలేదని విమర్శించారు. ఇప్పటికీ కరోనా వల్ల ప్రమాదం లేదనే ట్రంప్‌ చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రజలు ఎల్లప్పుడూ మాస్క్‌ ధరించేలా ప్రోత్సహిస్తామని, ర్యాపిడ్‌ టెస్టులు పెంచి వాటిల్లో పెట్టుబడులు పెడుతామన్నారు. సురక్షితంగా వ్యాపారాలు, పాఠశాలలను ప్రారంభించేలా జాతీయ స్థాయిలో ప్రమాణాలను రూపొందిస్తామని హామీ ఇస్తున్నామన్నారు.