విరాట్ డబుల్‌ ధమాకా..అభిమానులు ఫుల్ ఖుషీ!

వాస్తవం ప్రతినిధి : మైదానంలో ఎంతో ఉద్వేగంగా ఉండే కోహ్లీ ఒక్కోసారి తనలోని హాస్య చతురతతో అభిమానులను అలరిస్తుంటాడు. బుధవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో కూడా కోహ్లీ తనలోని సెన్సాఫ్‌ హ్యూమర్‌ను బయ టపెట్టాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లు విజృంభించి కోల్‌కతా బ్యాట్య్‌మెన్‌కు చుక్కలు చూపించారు. దీంతో మోర్గాన్‌ సేన 84పరుగులకే పరిమితమైంది. అనంతరం 85పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన 2వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని ఛేదించింది. అయితే 14వ ఓవర్లో లక్ష్య ఛేదనకు 3పరుగులు అవసరమయ్యాయి. ఈ ఓవర్లో తొలి బంతికే కోహ్లీ 2పరుగులు చేశాడు. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. ఒక పరుగు చేస్తే చాలు బెంగళూరు విజయం సాధించినట్లే ఈ దశలో మూడో బంతిని ఎదుర్కొన్న కోహ్లీ ఒక్క పరుగు పూర్తిచేసి మరో పరుగు కోసం మళ్లి పరుగు అందుకున్నాడు. దీంతో మరో ఎండ్‌లో ఉన్న గుర్‌కీరత్‌మన్‌సింగ్‌ కూడా పరుగందుకున్నాడు. మొదటి పరుగుకే విజయ ఢంకా మోగించిన కోహ్లీ రెండో పరుగుతో డబుల్‌ ధమాకా చేసి అభిమానులను అలరించాడు. అయితే ఈ రెండోపరుగును పరిగణనలోకి తీసుకోరు. విజయం సాధించిన తరువాత కూడా మరో పరుగు తీస్తే దాన్ని కౌంట్‌ చేయరు. ఒకవేళ విజయానికి సింగిల్‌ రన్‌ అవసరమైనపుడు ఫోరు లేదా సిక్సర్‌కొడితే మాత్రం కౌంట్‌ చేస్తారు. బౌండరీ, సిక్సర్‌కు ఈ వెసులుబాటు ఉంది. కాగా బెంగళూరు తన తర్వాత మ్యాచ్‌ను అక్టోబర్‌ 25న చెన్నైతో ఆడనుంది.