సేవ్ అమరావతి అంటూ నారా లోకేష్ రాష్ట్ర ప్రజలకు పిలుపు..!!

వాస్తవం ప్రతినిధి: 2014 ఎన్నికల తర్వాత సీఎం అయిన చంద్రబాబు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించటం అందరికీ తెలిసిందే. అయితే అమరావతి రాజధాని గా చంద్రబాబు ఏర్పాటు చేయటం వెనకాల… కొన్ని స్వలాభాలు ఉన్నాయని, అంతేకాకుండా.. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆరోపిస్తూ వచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి రావడంతో జగన్ ముఖ్యమంత్రి అవడం తో రాజధాని అమరావతి విషయంలో ఏ విధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తుందో అందరికీ తెలిసిందే. అభివృద్ధి ఒకచోట ఉండకూడదని అన్ని చోట్ల అభివృద్ధి జరగాలని వికేంద్రీకరణ పేరిట… అమరావతి రాజధానిగా ఉంచుతూనే కర్నూలు విశాఖ ప్రాంతాలను కూడా రాజధానిగా గుర్తించడం జరిగింది. అయితే ఈ క్రమంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు… వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు నిరసనలు దాదాపు 300 రోజులకు పైగానే చేపడుతూ వస్తున్నారు. ఈ విషయంలో టిడిపి పార్టీ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది.

ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి అమరావతిని కాపాడుకోవాలి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజాగా ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. నారా లోకేష్ ఏమన్నారంటే….విభజనతో అన్యాయమైపోయిన ఆంధ్రులు దేశం గర్వపడే స్థాయిలో ఒక రాజధానిని కట్టుకుంటున్నారు అని చెప్పి దేశ ప్రధానితో సహా పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆంధ్రులను అభినందించారని అన్నారు. అయితే నాటి ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో కూర్చుని విధ్వంసకర ఆలోచనలు చేసారని, ఐదేళ్ళ క్రితం ఇదే రోజున శంకుస్థాపన చేసుకున్న అమరావతి నిర్మాణం కొనసాగివుంటే ఈ రోజు రాష్ట్రమంతా పండుగ వాతావరణం ఉండేదని, కానీ ప్రజలకు ఆ సంతోషం లేకుండా చేసి జగన్ తమ ‘విషపునీయత’ చూపించుకున్నారని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలంతా ఒక్కటిగా నిలిచి అమరావతిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.