మరో పది రోజుల్లో జైలు నుంచి విడుదలవుతున్న చిన్నమ్మ?

వాస్తవం ప్రతినిధి : జయలలిత అక్రమాస్తుల కేసులో శిక్ష ముగించుకుని జనవరిలో శశికళ విడుదల కానున్నారని ఇప్పటికే సంకేతాలు వెలుడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తరఫున పలు కేసులను వాదించిన లాయర్ రాజా చెందూర్‌ పాండియన్‌ రాజా చెందూర్ పాండియన్, మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక జైళ్ల నిబంధనల మేరకు శిక్షను అనుభవిస్తున్న వారికి నెలలో 3 రోజులు సత్ప్రవర్తన పరిధి ఉంటుందని, ఈ లెక్కల ప్రకారం శశికళకు 129 రోజుల శిక్షా కాలం తగ్గాల్సి వుందని తెలిపారు. ఆమె ఇప్పటికే 43 నెలలకు పైగా జైలు జీవితాన్ని అనుభవించారని, మరో పది రోజుల్లో ఆమె బయటకు వస్తారని అన్నారు.

కాగా, ప్రస్తుతం కర్ణాటకలో కోర్టులకు దసరా సెలవులు నడుస్తున్నాయి. మళ్లీ 26న కోర్టులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆ వెంటనే శశికళ విడుదలపై ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మంగళవారం లేదా బుధవారం శుభవార్త తెలుస్తుందని పాండియన్ తెలిపారు.