అమరావతి కేసుకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు…!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న విషయాలలో ఒకటి రాజధాని అమరావతి. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక టిడిపి హయాంలో ప్రకటించిన అమరావతి రాజధాని భూముల విషయంలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని… మంత్రుల చేత విచారణ కమిటీ వేసి దానిని సీఎం జగన్ ఏసీబీ కి అప్పగించిన సంగతి తెలిసిందే.

కాగా ఈ కేసు విషయంలో అవినీతి నిరోధక శాఖ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయగా అప్పట్లో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో హైలెట్ గా మారింది. అయితే ఈ విషయం హైకోర్టు దాకా వెళ్లడంతో…. అవినీతి నిరోధక శాఖ చేస్తున్న విచారణ నిలిపి వేయడమే కాకుండా, అమరావతి కి సంబంధించిన వార్తలను వెబ్ మీడియాలో గాని ఎలక్ట్రానిక్ మీడియాలో గాని ప్రచారం చేయకూడదని ఆదేశించడం కలకలం రేపింది.

అయితే తాజాగా అదే హైకోర్టుకు చెందిన మరో బెంచ్ అస్సైన్డ్ భూముల కుంభకోణంలో తుళ్లూరు మాజీ తహశీల్దార్ పై వచ్చిన ఆరోపణల మీద సిఐడి దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. దర్యాప్తును ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం, స్టే ఇవ్వడం లాంటివి చేయరాదని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టంగా చెప్పిందని తాజా తీర్పులో పేర్కొనడం విశేషం. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ అన్నె సుధీర్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. సీఐడీ తరఫున పీపీ కె.శ్రీనివాసరెడ్డి, సుదీర్‌బాబు తరఫున దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు.