ఏపీలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై కేంద్ర మంత్రి ప్రశంశలు..!!

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ సర్కార్ ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు జాతీయ మీడియాలో ప్రసారమవుతూ బాగా హైలెట్ అవుతున్నాయి. ఇటువంటి తరుణంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పొక్రియల్ పొగడ్తల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు ఏర్పాటు, ప్రభుత్వ స్కూళ్లలో “నాడు నేడు” కార్యక్రమం అద్భుతమైన ప్రోగ్రాం అంటూ కొనియాడారు. కరోనా కారణంగా మూతపడ్డ పాఠశాలలు త్వరలో దేశవ్యాప్తంగా ఓపెనింగ్ అవుతున్న తరుణంలో వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రమేష్ పోక్రియల్ మాట్లాడుతూ.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారన్నారు. ఆయన తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారు. సీఎం జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు.

విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని పోక్రియాల్ ఈ సమావేశంలో చెప్పుకొచ్చారు.