ట్రంప్‌కు చైనాలో బ్యాంక్ అకౌంట్.. రాజకీయంగా కలకలం..!!

వాస్తవం ప్రతినిధి : నవంబర్ 3న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ హోరాహోరీగా తలపడుతున్నారు. ఇప్పటికిప్పటి పరిస్థితులను బట్టి ఎన్నికల పోరులో జో బైడెన్ కాస్త ముందంజలో ఉన్నారనీ.. ఆయనకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అమెరికన్ మీడియా కోడైకూస్తోంది. అయినా ట్రంప్ మాత్రం తనదే విజయమన్న ధీమాను కనపరుస్తున్నారు.

కాగా.. ట్రంప్‌కు చైనాలో ఓ బ్యాంక్ అకౌంట్ ఉందని తాజాగా బయటపడటంతో రాజకీయంగా కలకలం రేపుతోంది.. చైనా ఉత్పత్తులపై ట్యాక్సులను విపరీతంగా పెంచడం, కొన్ని ఉత్పత్తులపై నిషేధం విధించడం, కరోనా మహమ్మారికి చైనాయే ప్రధాన కారణమని బహిరంగంగానే ఆరోపిస్తూ.. డ్రాగన్‌ దేశంపై ట్రంప్ యుద్ధం ప్రకటించినంత పనిచేశారు. ఇప్పుడు ఆ దేశంలో ఓ బ్యాంక్ అకౌంట్ ఉందన్న విషయం బయటపడటంతో ఆయన ఆత్మరక్షణలో పడ్డట్టయింది. ఇదిలా ఉండగా… ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఏఏ లావాదేవీలు జరిగాయన్నది బయటకు రావడం లేదు. ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్‌మెంట్ ఎల్.ఎల్.సీయే ఆ చైనా బ్యాంకు ఖాతాను నిర్వహిస్తోంది. అయితే ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత మేరకు డబ్బు లావాదేవీలు జరిగాయన్నది ట్యాక్స్ రికార్డుల్లో నమోదు కాకపోవడం గమనార్హం.