పరాయి దేశంలో పాడు పని.. కటకటాల పాలైన ఎన్నారై..!

వాస్తవం ప్రతినిధి : విదేశీ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి నేరాలకు పాల్పడితే విదేశాల్లో బహిరంగ ఉరిశిక్షలు, యావజ్జీవ శిక్షలు వేశారని తరచూ వింటూనే ఉంటాం. తాజాగా ఓ భారతీయుడు కామంతో చేసిన ఒక చేష్ట.. అతడికి ఏడు నెలల జైలు శిక్ష పడేలా చేసింది. ఈ ఉదంతం సింగపూర్‌లో చోటు చేసుకుంది. తనకు ఇష్టం లేకుండా ఓ మైనర్ బాలికను బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు గానూ చెల్లం రాజేష్ కన్నన్(26) అనే భారతీయుడికి సింగపూర్ కోర్టు ఏడు నెలల జైలు శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. చెల్లం రాజేష్ ఖన్నన్ అనే 26 ఏళ్ల భారతీయుడు సింగపూర్‌లో ఓ ప్రముఖ కంపెనీలో సేఫ్టీ కోఆర్డినేటర్‌గా కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు. గతేడాది అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ 16 ఏళ్ల బాలిక పరిచయం అయింది. ఆన్‌లైన్‌లోనే వారిద్దరూ చాటింగ్ చేసుకునేవారు. అయితే ఒక్క రోజు తన రూమ్‌కు స్నేహితులు వచ్చారనీ.. వారి కోసం మద్యం తేవాల్సిందిగా రాజేష్ ను కోరింది బాలిక. దీంతో రాజేష్ మద్యం బాటిళ్లు కొని ఆమె ఉంటున్న ఫ్లాట్‌కు వెళ్లాడు.

అయితే ఇదే అదనుగా రాజేష్ ఆ బాలికను ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. అయిన వినకుండా .. ఆమెను బలవంతం చేశాడు రాజేష్. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక ప్రతిఘటించి తన గదికి వెళ్లిపోయింది. ఈ విషయమై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తాను ఈ నేరానికి పాల్పడినట్టు రాజేష్ కోర్టులో అంగీకరించాడు. రాజేశ్ చేసిన నేరానికి గానూ 7 నెలల జైలు శిక్షను విధిస్తూ సింగపూర్ కోర్టు తీర్పునిచ్చింది.