కాసేపట్లో సీఎం పర్యటన..ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు

వాస్తవం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై మౌనస్వామి ఆలయం వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఏపీ సీఎం జగన్‌మోహ్మన్‌ రెడ్డి పర్యటనకు కొన్నిగంటల ముందు కొండచరియలు విరిగిపడటం అధికారులను కలవరానికి గురిచేసింది. సీఎం పర్యటన ఉండటంతో అధికారులు భక్తుల రాకపోకలను నిలిపివేయడంతో ప్రాణనష్టం తప్పింది.

పోలీసులు, సహాయక బృందాలు, ఆలయ సిబ్బంది రంగంలోకి దిగి కొండచరియలను తొలగిస్తున్నారు. మూడురోజులుగా ఇక్కడ చిన్నచిన్న రాళ్లు కూలిపడుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు భక్తులను అప్రమత్తం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడుతుండటంతో భక్తులు, అధికారులు బెంబేలెత్తిపోతున్నారు.