సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ!

వాస్తవం ప్రతినిధి: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకోరూపంలో భక్తులకు అభయమిస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకొని భారీగా తరలివస్తున్నారు. టికెట్లలో కేటాయించిన సమయం ప్రకారమే భక్తులు దర్శనానికి రావాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఈ రోజు మూలానక్షత్రం కావున అమ్మవారి అభయం పొందేందుకు భక్తులు బెజవాడ దుర్గగుడికి పోటెత్తుతున్నారు. ఆశ్వయుజ శుద్ధపంచమి, అందులో ఐదవ రోజు కావడంతో ఇవాళ అమ్మవారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం నాటి నుంచి విజయదశమి వరకు విశేష పుణ్య దినాలుగా భక్తులు భావిస్తారు. ఇక ఆలయ అధికారులు కరోనా నిబంధనలు పాటిస్తూ.. భక్తులను పరిశీలించిన తర్వాతే ఆలయం లోపలికి అనుమతిస్తున్నారు. క్యూలైన్లలో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. వేకువజామున 3గంటల నుంచి రాత్రి 9గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ప్రభుత్వం తరఫున ఏపీ సీఎం జగన్‌ ఇవాళ మధ్యాహ్నం 3.40 గంటలకు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.