దుర్గాదేవిగా కమలా హారిస్ .. అమెరికాలోని హిందూ సంఘాలు ఆగ్రహం..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో డెమెక్ర‌టిక్ వైస్ ప్రెసిడెంట్ నామినీ క‌మ‌లాదేవి హారిస్ కొత్త చిక్కుల్లోప‌డ్డారు. ఆమెను దుర్గాదేవిగా చూపిస్తూ త‌న మేన కోడ‌లు మీనా హారిస్ ఓ మార్ఫింగ్ ఫోటోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేయ‌డం దుమారం రేపుతోంది. అమెరికాలోని హిందూ సంఘాలు ఈ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించాయి. హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా, హిందూ దేవ‌త‌ల ప‌విత్ర‌త‌ను కించ‌ప‌రిచేలా ఫోటో ఉందంటూ భ‌గ్గుమ‌న్నాయి. వెంట‌నే ఫోటోను తొల‌గించి.. క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశాయి. హిందూ సంఘాలు అనుచితమంటూ వ్యాఖ్యానించడంతో ఆ ట్వీట్‌ను మీనా హారిస్‌ తొలగించారు.

మీరా హారిస్‌ పోస్ట్‌ చేసిన చిత్రంలో ఏముందంటే.. దుర్గాదేవిగా కమలాహారిస్‌ ఉన్నారు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నేమో మహిషాసురుడిగా చిత్రీకరించారు. డెమొక్రాటిక్‌ పార్టీ నుంచి అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జో బైడెన్‌ ఏమో అమ్మవారి వాహనం సింహంగా చూపించారు. “దుర్గామాత వ్యంగ్య చిత్రాలతో కమలా హారిస్‌ మార్ఫింగ్‌ ఫొటో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది హిందువులను తీవ్రంగా క్షోభకు గురిచేసింది” అని హిందూ అమెరికన్-ఫౌండేషన్‌కు చెందిన సుహాగ్ ఏ శుక్లా సోమవారం ట్వీట్‌లో పేర్కొన్నారు.

దుర్గామాత చిత్రాలతో కమలాహారిస్‌ మార్ఫింగ్‌ ఫోటో హిందువులను తీవ్రంగా బాధపెట్టిందని, ఇలా తమ ఓట్లను గెల్చుకోవాలనుకుంటే మాత్రం అది జరగని పని అని ప్రముఖ రచయిత షెఫాలీ వైద్య ట్విట్టర్‌లో తన నిరసన తెలిపారు. అయితే ఈ ఫోటోను మీనా సృష్టించింది కాదనీ, ఆమె ట్వీట్‌కు ముందే ఇది వాట్సప్‌లో చక్కర్లు కొట్టిందని హిందూ అమెరికన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీకి సభ్యుడు రిషి భుటాడా అంటున్నారు. అయినప్పటికీ తప్పు తప్పే కాబట్టి మీనా క్షమాపణలు చెప్పాల్సిందేనని చెబుతున్నారు.