సీఎం రిలీఫ్ ఫండ్‌కి తనవంతు సాయం ప్రకటించిన జనసేనాని!

వాస్తవం ప్రతినిధి: హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు ప్రమాదకర స్థితిలో కి వెళ్లిపోయాయి. చాలా వరకు ఇల్లు నీట మునగడంతో నిత్యావసర సరుకులు కొన్నిచోట్ల ఇల్లు కూడా కోల్పోయిన పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ పరిస్థితి చాలా విచారకరంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో వరద బాధితులను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను చేపడుతోంది.

మరోపక్క బాధితులను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు సినీ సెలబ్రిటీలు కూడా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు, మ‌హేష్ బాబు కోటి, ప్రభాస్ కోటి, బాలకృష్ణ 50 లక్షలు, నాగార్జున 50 ల‌క్ష‌లు, ఎన్టీఆర్ 50 ల‌క్ష‌లు, రామ్ పోతినేని 25 లక్షలు, విజ‌య్ దేవ‌ర‌కొండ 10 ల‌క్ష‌లు, హారికా హాసిని క్రియేషన్స్ 10 లక్షలు, త్రివిక్రమ్ 10 లక్షలు, హ‌రీష్ శంక‌ర్, అనిల్ రావిపూడి చెరో 5 ల‌క్ష‌లు సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు.

అయితే తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తనవంతు సాయంగా తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించాడు. అంతేకాదు జనసైనికులు, అభిమానులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.