మరింత జాగ్రత్తగా ఉండాలి అంటున్న ప్రధాని మోడీ..!!

వాస్తవం ప్రతినిధి: ప్రధాని మోడీ ఇటీవల జాతినుద్దేశించి కరోనా విషయం గురుంచి మాట్లాడటం జరిగింది. దేశంలో కరోనా ప్రభావం తగ్గిందని కానీ ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్ అందుబాటులో వచ్చేంతవరకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మహమ్మారి కరోనా వైరస్ విషయంలో జనతా కర్ఫ్యూ మొదలుకొని ఇప్పటివరకు ప్రజలంతా గొప్పగా సమయం పాటించారని, అయితే ప్రస్తుతం పండగ సీజన్ కావడంతో అందరూ సంయమనం పాటించాలని…ఇష్టానుసారంగా బయట ఇంకా చాలామంది తిరుగుతున్నారని పేర్కొన్నారు.

అలాగే దేశంలో రికవరీ రేటు పెరిగిందని, మరణాల రేటు తగ్గిందని చెప్పుకొచ్చారు. దేశంలో పండగలను జరుపుకుంటూనే కరోనా పట్ల అప్రమత్తతను మరవవద్దని అన్నారు. మాస్క్ ధరించడం సహా ఇతర నియంత్రణ చర్యలను అంతా పాటించాలని అందరికి చేతులు జోడించి ప్రార్ధిస్తున్నట్టు కోరారు.

మాస్క్ లేకుండా బయటకు వెళితే మనం మనతో పాటు మన కుటుంబాలను కూడా ఇబ్బందుల్లోకి నెట్టినవాళ్లమవుతామని అన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తుంది అని కొన్ని వ్యాక్సిన్లు రెండో దశ, మూడో దశ ప్రయోగాల్లో ఉన్నట్లు స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వచ్చిన అనంతరం ప్రతి ఒక్కరికి అందిస్తామని చెప్పుకొచ్చారు.